ఐఏఎస్ అధికారులకు శిక్ష నుంచి ఊరట

ఐఏఎస్ అధికారులకు శిక్ష నుంచి ఊరట

అమరావతి: ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష, జరిమానాల నుంచి హైకోర్టు డివిజన్ బెంచ్ ఊరట కలిగించింది. సాధారణ మహిళ.. భూమి కోల్పోయినందుకు పరిహారం చెల్లించే విషయంలో నిర్లక్ష్యం వహించారంటూ ఐఏఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈనెల 2వ తేదీన ఏకంగా జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించిన విషయం తెలిసిందే. శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు ఐఏఎస్ అధికారులకు నెల రోజుల గడువివ్వడంతో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి మన్మోహన్ సింగ్‌, ఐఏఎస్‌ అధికారి ముత్యాల రాజు, శేషగిరి బాబు, కెవీఎన్‌ చంద్రధర్‌ బాబు అప్పీల్‌ చేసుకున్నారు. వీరి అప్పీల్ ను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ విచారణకు స్వీకరించింది.
ఈ కేసు గురువారం విచారణకు రాగా ఐఏఎస్ అధికారులు తమ వాదనలు వినిపించారు. నెల్లూరు జిల్లా తాళ్లపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే మహిళకు అప్పటికే భూ పరిహారం పూర్తిగా చెల్లించడం జరిగిందని, తమవంతుగా అధికారులు కోర్టు ఉత్తర్వులు అమలులో ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదని డివిజన్ బెంచ్‌ దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఆదేశాలను ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదని వివరించగా.. ఐదుగురు సీనియర్‌ ఐఏఎస్‌లకు శిక్ష విధిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌ సస్పెండ్ చేసింది.